పొరుగు దేశం బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు భారత్ కు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం బంగ్లాదేశ్ ప్రధాని హసీనా అవమానకర రీతిలో స్వదేశాన్ని వీడారు.అందుకు కారణం అక్కడ విద్యార్థి ఉద్యమం. ఆ తర్వాత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనిస్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ అక్కడ శాంతి నెలకొనలేదు. విధ్వంసం కొనసాగుతోంది. ముఖ్యంగా హిందువులపై అణిచివేత కొనసాగుతున్నది. మైనార్టీల హక్కుల పై పోరాడుతున్న హిందూ నేతలపై దేశ ద్రోహం కేసులు పెడుతూ జైళ్లలో నిర్బంధిస్తన్నారు.  హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయి. వీటిని ప్రతిఘటించిన ఇస్కాన్ ప్రచారకర్త ప్రభు కృష్ణ దాస్ ను అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసింది.

ఓ భారీ ర్యాలీలో జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో కృష్ణదాస్ ను ఢాకాలో అరెస్ట్ చేసారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు బెయిల్ తిరస్కరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇటీవలే బంగ్లాలో నివసిస్తున్న మరో ఇద్దరు ఇస్కాన్ సాధువులను అరెస్ట్ చేసారు.  పాకిస్తాన్ కే పరిమితమైన ఇటువంటి ద్వేష సంస్కృతి ఇప్పుడు బంగ్లాలోకి ప్రవేశించిందని ఆ దేశానికి చెందిన సీనియర్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే పరిస్థితులు ఎంతగా అదుపు తప్పాయో అర్ధం చేసుకోవచ్చు.

షేక్ హసీనాను గద్దెదించిన తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ జమాత్ ఏ ఇస్లామీ చెలరేగిపోయింది. ఈ సంస్థ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి హిందూ మైనారిటీ వర్గాలను అరెస్ట్ చేయిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్ పరిణామాలు ఆ దేశ అంతర్గత వ్యవహారాలని ఇండియా వ్యాఖ్యానించినా, అక్కడి మైనారిటీల భద్రతపై మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. బంగ్లా పరిణామాలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు విదేశాంగ మంత్రి జైశంకర్ తో చర్చిస్తున్నారు. హిందువుల రక్షణ విషయమై సమీక్షిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

error: Content is protected !!