ప్రైడ్ తెలుగు న్యూస్ –  దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కు పశ్చిమ బెంగాల్ లోని సిల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. జీవిత ఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. నేరస్తుడు మరణించే వరకూ జైలులోనే ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో కోర్టు మొత్తం 120 మంది సాక్షులను విచారించింది. 162 రోజుల్లో మొత్తం విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వడం ఇక్కడ మరో విశేషం.

ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించగా.. ఇది అరుదైన కేసని, అతడికి మరణ శిక్ష విధించాలని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. సీబీఐ వాదనలు విన్న కోర్టు ఇది అరుదైన కేసు కాదని పేర్కొంది. దీంతో సంజయ్ కు జీవిత  ఖైదు విధిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ కేసులో దోషికి జీవిత ఖైదు విధించడం పట్ల బాధిత కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. తమకు ఎటువంటి నష్ట పరిహారం అవసరం లేదని, దోషికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నామని కోర్టులోని నినాదాలు చేశారు. పై కోర్టుకు వెళ్తామని చెప్పారు. సంజయ్ కు శిక్ష ఖరారు నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేసారు.

ఆర్జీకర్ వైద్యురాలి అత్యాచార ఘటనకు సంబంధించిన  కేసులో తీర్పుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు.  జూనియర్ వైద్యురాలి హత్యచార ఘటనకు సంబంధించిన కేసులో దోషికి మరణ శిక్ష విధించాలని మేమంతా డిమాండ్ చేశాం. కాని అలా జరగలేదు. ఒక వేళ ఈ కేసును బెంగాల్ పోలీసులు దర్యాప్తు జరిపి ఉంటే దోషికి మరణ శిక్ష పడేలా శాయశక్తులా ప్రయత్నించేవారు అన్నారు. రాష్ట్ర పోలీసులు విచారించిన ఇలాంటి అనేక కేసుల్లో దోషులకు మరణశిక్ష పడింది. ప్రస్తుత తీర్పు సంతృప్తికరంగా లేదని అని విలేకరుల ఎదుట సీఎం మమతా పేర్కొన్నారు.

error: Content is protected !!