
ఓటీటీ ప్లాట్ ఫామ్ – అమెజాన్ ప్రైమ్
విడుదల తేదీ – జనవరి 17 – 2025
సీజన్ – సెకండ్ సీజన్
ప్రైడ్ తెలుగు రేటింగ్ – 8/10
పంచ్ లైన్ – వెల్ కమ్ టు పాతాళ్ లోక్
వెబ్ సిరీస్ అంటే ఏడు గంటలు, ఎనిమిది గంటలు ఉంటుంది. ఎంత మంచి కథ రాసుకున్నా, తెరపై కనిపించే పాత్రలు , తమదైన నటనతో రక్తి కట్టించినప్పుడే, ఆ వెబ్ సిరీస్ చూడగలం. అన్ని గంటల పాటు, 7,8 ఎపిసోడ్స్ దాటుకుంటూ వెళ్లగలం. పాతాళ్ లోక్ సీజన్ -2, ఈ కోవలోకే వస్తుంది. ఐదేళ్ల క్రితం విడుదలైన పాతాళ్ లోక్, ఓటీటీ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. కథ, కథనం, పాత్రలు, మరీ ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషించిన జయదీప్ అహ్లావత్, నటన ఈ వెబ్ సిరీస్‌ను సూపర్ హిట్ చేసింది. మరో స్థాయిలో నిలబెట్టింది.

ఇప్పుడు ఐదేళ్ల తర్వాత వచ్చిన రెండో సీజన్ లోనూ, సేమ్ సీన్ రిపీటైంది. బలమైన కథ, అందుకు తగ్గ స్క్రీన్ ప్లే, అద్భుతమైన పాత్రలు, వీటి మధ్య హాథీరామ్ చౌదరీ పాత్రలో జయదీప్ అహ్వావత్ అత్యఅద్భుతమైన నటన. ఈ సిరీస్ ను తప్పక చూడాల్సిన సిరీస్ లిస్ట్ లో చేర్చిందని చెప్పవచ్చు. మొదటి భాగం చూసిన వారికి పాతాళ లోకం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కాని కొత్తగా సిరీస్ చూడాలి అనుకునేవారు మాత్రం, మొదటి సిరీస్ చూసి రెండో సిరీస్ చూడటం ఉత్తమం. అప్పుడు పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ ఫార్మాట్ ఏంటి అనేది అర్ధమవుతుంది.

మొదటి భాగం దారిలోనే రెండో సీజన్ లోనూ ఒక కేసును దర్యాప్తు చేసే పోలీస్ అధికారి పాత్రలో నటించాడు జయదీప్. కాకపోతే ఈసారి ఇన్వెస్టిగేషన్ కోసం నాగా లాండ్ కు వెళ్తాడు. దాదాపు ఆరేడు గంటల వెబ్ సిరీస్ కథ, ఇక్కడ ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. కాకపోతే ఒక కేసుకు సంబంధించిన వ్యక్తులు ,ఒకరి తర్వాత మరొకరు హత్యకు గురి అవుతుండటంతో, టెన్షన్ బిల్డ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ రైడ్ స్టార్ట్ అవుతుంది. విలన్ కళ్ల ముందే తిరుగుతున్నా, అతనే విలన్ అని లాస్ట్ ఎపిసోడ్ వరకు, రివీల్ కాకపోవడం, ఈ సిరీస్ లో మరో హైలైట్.
ఈ సిరీస్ గురించి ఎంత చెప్పినా, ఎంత సేపు చెప్పుకున్నా, మొత్తం క్రెడిట్ దర్శకుడు, హీరో రోల్ చేసిన జయదీప్ అహ్లావత్ కు దక్కుతుంది. ముఖ్యంగా జయదీప్ నటనను మాటల్లో వర్ణించలేం. పోలీస్ పాత్రలోకి తాను పరకాయ ప్రవేశం చేసిన తీరు అద్భుతం. ఒక కేసును ఇన్వెస్టిగేషన్ చేసే విధానం, అందుకు జయదీప్ ఎంచుకున్న బాడీ లాంగ్వేజ్, మధ్య తరగతి వ్యక్తిగా బాధలు, ఉద్యోగంలో పదోన్నతి లభించకపోవడంతో నిరాశ, రోజుల తరబడి డ్యూటీ, వీటి మధ్య కుటుంబం, ఎన్ కౌంటర్లు, షూట్ అవుట్లు, సన్నిహితులు చనిపోవడం, ఇలా ఎన్నో లేయర్స్ ఉన్న పాత్రను అత్యఅద్భుతంగా పోషించాడు జయదీప్ అహ్లావత్.

మిగితా పాత్రల గురించి కూడా మాట్లాడుకోవాలి కాని, రివ్యూ లెన్త్ పెరిగిపోతుంది. మొత్తంగా ప్రైడ్ తెలుగు , పాతాళ్ లోక్ సెకండ్ సీజన్ కు ఇస్తోన్న రేటింగ్ 8/10 . మొత్తం 8 సీజన్లుగా వచ్చిన సీజన్ -2ను కాస్త ట్రిమ్ చేసి, 7 ఎపిసోడ్స్ కింద కుదిస్తే బాగుండేది. అయినప్పటికీ ఇదో పెద్ద సమస్య కాదు. ఫైనల్ పంచ్ లైన్ ఏంటంటే – వెల్ కమ్ టు పాతాళ్ లోక్