రైతుల నిరసనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం తప్పు పట్టింది. భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ కంగనాను మందిలించింది. కేంద్రంలో నాయకత్వం బలంగా లేకపోయినట్లైతే రైతుల నిరసనలతో దేశంలో బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు తలెత్తేవని ఇటీవల ఒక హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా కామెంట్స్ చేసింది. అంతే కాకుండా రైతు ఉద్యమ సమయంలో శవాలు వేలాడుతూ ఉండేవని, అత్యాచారాలు జరిగేవని కంగనా ఆరోపించించి. ఉద్యమం వెనుక చైనా, అమెరికా కుట్ర ఉందని చెప్పింది కంగనా. దీని పై విపక్షాలు, అఖిల భారత కిసాన్ సభ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసాయి. కంగనా కామెంట్స్ దేశంలో రైతుల్ని అవమానించే విధంగా ఉన్నాయని, లోక్ సభ లో విపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కంగనా వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో బీజేపీ స్పందించింది. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. సున్నితమైన అంశాలపై మాట్లాడవద్దని కంగనాను ఆదేశించినట్లు చెప్పింది.