ప్రైడ్ తెలుగు న్యూస్ – ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీలో ఎలాగైనా పీఠం కైవసం చేసుకోవాలనుకుంటున్న బీజేపీకి శీష్ మహల్ కుంభకోణం బ్రహ్మాస్ట్రంగా మారింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం మొత్తం ఈ శీష్ మహల్ చుట్టూనే తిరుగుతోంది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి కేజ్రీవాల్ 7 స్టార్ రిసార్ట్ రేంజ్ లో,శీష్ మహల్ ను మార్చుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. విమర్శిస్తోంది. దీనికి కౌంటర్ గానే ఆప్ పీఎం నివాసాన్ని రాజ్ మహల్ అంటూ విమర్శలు చేస్తోంది.
అసలు ఈ శీష్ మహల్ ఏంటి?ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన క్రమంలో ఆయనకు అధికారిక నివాసంగా శీష్ మహల్ ను కేటాయించారు. పదవి నుంచి దిగిపోయేవరకు కేజ్రీ ఇందులోనే నివాసం ఉన్నారు. మొదట ఈ నివాసానికి మరమత్తుల కోసం 7.81 కోట్లు ప్రతిపాదించి పనులు ప్రారంభించారు. ఆ తర్వాత మరమత్తులు పెరుగుతూ పోయి ప్రాజెక్ట్ వ్యయం అనూహ్యంగా పెరిగింది. మొత్తంగా నిర్మాణానికి 33.66 కోట్లు ఖర్చు చేసారు. ఈ ధనంతో శీష్ మహల్ ను కేజ్రీవాల్ అద్దాల మందిరంగా మార్చుకున్నారని బీజేపీ ముందు నుంచి ఆరోపిస్తోంది.
బీజేపీ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ ఇటీవల కాగ్ నివేదికలో కూడా శీష్ మహల్ నిర్మాణానికి అవకతవకలు జరిగినట్లు బయటపడింది. బంగ్లా ధర 7.91 కోట్ల నుంచి 33.66 కోట్లకు పెంచారని కాగ్ లెక్కల్లో తెలిపోయింది. ఇందులో 26 కోట్లకు పైగా అవినీతి జరిగిందనే అనుమానాలు నివేదికలో పేరొంది. అసలు శీష్ మహల్ నిర్మాణానికి కేజ్రీవాల్ ఎంత ఖర్చు చేసారో ఢిల్లీ ప్రజలకు తెలియజేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా డిమాండ్ చేసారు. అయితే ఆప్ మాత్రం శీష్ మహల్ నిర్మాణవ్యయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెబుతోంది. బీజేపీ చేస్తోన్న ఆరోపణలు ఖండించింది. అసలు పేద ప్రధాని చెప్పే మోదీ ప్రస్తుతం 7,200 కోట్లు ఖరీదు చేసే భవనంలో ఎందుకు నివసిస్తున్నారని ఆప్ ఎదురు దాడికి దిగింది. అది రాజ్ మహల్ అంటూ విమర్శలు ప్రారంభించింది. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఒకరి లోపాలను మరొకరు ఎత్తిచూపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.