శోభితా ధూళిపాళ మెడలో నాగ చైతన్య మూడు ముళ్లు వేసేసాడు. డిసెంబర్ 4 సాయంత్రం ఘనంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైన పెళ్లి వేడుక, చూడ ముచ్చటగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో శోభితా, నాగ చైతన్య వివాహం జరిగింది.
అక్కినేని వారి పెళ్లి సందడికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, టి. సుబ్బరామిరెడ్డి, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, అల్లు అరవింద్, కీరవాణి, సుహాసిని ,మరికొందరు సినీ తారలు హాజరయ్యారు, కొత్తజంటను ఆశీర్వదించారు. చైతన్య, శోభిత పెళ్లి ఫోటోలను అక్కినేని నాగార్జున స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేసారు. శోభిత, చైలు కలసి అందమైన కొత్త జీవితాన్ని ప్రారంభించడం భావోద్వేగ క్షణం అని రాసుకొచ్చారు నాగార్జున. శోభితకు మా కుటుంబంలోకి స్వాగతం అన్నారు. నాన్నగారు శతజయంతికి గుర్తుగా స్థాపించిన ఏఎన్నార్ విగ్రహం చెంత ఆయన ఆశీర్వాదంతో ఈ వేడుక జరగడం మరింత అర్థాన్ని తీసుకొచ్చింది అన్నారు నాగార్జున.
గత రెండేళ్లుగా నాగ చైతన్య, శోభితా ప్రేమలో ఉన్నారు. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకున్నారు.ఆ తర్వాతే అక్కినేని ఇంటికి కోడలిగా అడుగు పెట్టింది శోభితా. మరోవైపు పెళ్లి ఏర్పాట్లను స్వయంగా నాగ చైతన్య, శోభితా దగ్గరుండి చూసుకున్నారు. వారు కలలు కన్న విధంగానే ఏఎన్ఆర్ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో, ఆయన విగ్రహం వద్దే వివాహం జరిగే ఏర్పాట్లు చేసారు. తెలుగు సినీ తారలు తరలి రాగా, అంగరంగ వైభవంగా చై, శోభితా వివాహ మహోత్సవం జరిగింది. ఇక అఖిల్ నెక్ట్స్ వెడ్డింగ్ కు రెడీ అవుతున్నాడు. ఇటీవలే వధువును పరిచయం చేసాడు. వచ్చే ఏడాది అఖిల్ కూడా ఒక ఇంటివాడు అవుతాడని అక్కినేని కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు చెప్పుకొస్తున్నారు.