కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి లోక్ సభలోకి అడుగు పెట్టారు.ఇటీవల కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో వయనాడ్ లోక్ సభ నుంచి పోటీ చేసి ,భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రియాంక గాంధీ. నవంబర్ 28,2024న,ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు. రాహుల్ గాంధీ , ఇతర నేతలతో కలసి సభకు వచ్చారు ప్రియాంక. కేరళ సంప్రదాయం ఉట్టిపడేలా కసావు చీర ధరించారు ప్రియాంక. స్పీకర్ ఓం బిర్లా కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యంగ ప్రతిని చేతిలో పట్టుకుని ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం ప్రక్రియను పూర్తి చేసారు.నెహ్రూ – గాంధీ కుటుంబంలో దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన మూడో వ్యక్తిగా ప్రియాంక గుర్తింపు తెచ్చుకున్నారు. వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి పై 4,10,031 ఓట్ల మెజారిటీతో గెలిచారు ప్రియాంక. ఎంపీ హోదాలో మొదటి సారి లోక్ సభలోకి ప్రవేశించారు.
1998 నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపును స్టార్ క్యాంపెనర్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు ప్రియాంక గాంధీ. సోనియా గాంధీ అమెథీలో పోటీ చేసినప్పుడు తొలిసారి బహిరంగ సభలో పాల్గొన్నారు. అప్పటికీ ప్రియాంక వయసు కేవలం 27 ఏళ్లు. నేత చీర, బాబ్డ్ హెయిర్ తో ఇందిరను గుర్తు తెచ్చారు ప్రియాంక. నాటి నుంచి కాంగ్రెస్ ఫ్యూచర్ లీడర్ గా క్యాడర్ భావించడం మొదలైంది. 2004, 2009 లోక్ సభ ఎన్నికల్లో సోనియా, రాహుల్ తరపున స్టార్ క్యాంపెయినర్ పని చేసారు ప్రియాంక.2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలు చెపట్టిన ప్రియాంక.. ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఎన్నికల్లో పార్టీ పెద్దగా సీట్లు గెలవకపోయినా, ప్రియాంక గాంధీ చేసిన ప్రచారం మాత్రం హైలైట్ అయింది.వయనాడ్ ఉప ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ సాధించిన 3.64 లక్షల ఓట్ల రికార్డ్ ను ప్రియాంక బ్రేక్ చేసారు. అలాగే 2019 ఎన్నికల్లో రాహుల్ మెజార్టీని సైతం దాటేసారు.