
చరిత్రలో ఎంతో మంది వీరులు ఉన్నారు. కాని కొంత మంది గురించే మనకు తెల్సిందని, తెలియని యోధులు చాలా మందే ఉన్నారని, ఛావా రిలీజైన తర్వాతే తెల్సిందే. ఫిబ్రవరి 14న బాలీవుడ్ లో భారీ ఎత్తున రిలీజైన ఛావా, హిందీ ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఈ రివ్యూ రాసే సమయానికి ఇండియాలోనే ఈ చిత్రం 500 కోట్లు దాటి ఉంటుంది
. అలాంటి బ్లాక్ బస్టర్ ను తెలుగులో చూడాలని ఉందని, తెలుగు రాష్ట్రాల నుంచి ఛావా సినీ అభిమానులు అడగడం, అందుకు తగ్గట్లుగానే గీతా ఆర్ట్స్ తెలుగు వర్షన్ ను మార్చి 7న విడుదల చేయడం చకా చకా జరిగిపోయాయి. మరి హిందీలో కనిపించిన ఫైర్, తెలుగువర్షన్ లోనూ రిపీటైందా..
ఒక హిందీ చిత్రాన్ని తెలుగు వర్షన్ లో రిలీజ్ చేస్తే చూడాలా.. ఎవరి పర్ఫామెన్స్ ఎలా ఉంది.. అసలు హిందీలో అంత బాగా ఎందుకు ఆడుతోంది.. ఇలాంటి విషయాలన్నిటిని, ప్రైడ్ తెలుగు రివ్యూ ద్వారా తెల్సుకుందాం రండి.
ఎప్పుడో ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన చిత్రం, తెలుగులో మొదటి రోజే 3 కోట్లకు పైగా వసూళ్లు అంటే,చిన్న విషయం కాదు. ఎందుకంటే ఛావా కథ ఉత్తరాది కథ. ఛావా హీరో ఉత్తరాది హీరో, మరి ఈ కథకు, ఈ హీరోకు మనం ఎందుకు కనెక్ట్ అయ్యాం అంటే, ఇది మన కథ. మనకు తెలియాల్సిన కథ. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ కథ. అందుకే తెలుగు నాట అంత నీరాజనం కనిపిస్తోంది. అలు ఫిబ్రవరి 14న హిందీ వర్షన్ తో తెలుగు వర్షన్ రిలీజై ఉంటే, ఈ వసూళ్ల స్థాయి మరింత పెద్ద స్థాయిలో ఉండేది.
చరిత్రకు సంబంధించిన యోధుడి కథ, నిజానికి ఇందులో ఎలాంటి కమర్షియల్ హంగులు ఉండవు. స్క్రీన్ ప్లే కోసం ఎలాంటి ప్రయోగాలు చేయాడానికి వీలు లేదు. ట్రైలర్ రిలీజైనప్పుడు శంభాజీ పాత్రలో నటించిన విక్కీ నాలుగు స్టెప్పులు వేస్తే, వివాదానికి దారి తీసింది. దాంతో చిత్ర యూనిట్ అప్పటికప్పుడు ఆ సీన్స్ కు కట్ చెప్పింది. ఇలాంటి కథను రెండు గంటలకు పైగా చెప్పడం, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, రోమాలు నిక్కబొడుచుకునేలా తెరకెక్కించడం దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కు చెల్లింది.
ఎంత రీసెర్చ్ వర్క్ చేసాడో, ఎంత కష్టపడ్డాడో కాని, ఆ కష్టం అంతా తెరపై కనిపిస్తూ ఉంది.ఇక శంభాజీ పాత్రను పోషించిన విక్కీ కౌషల్ అద్భుత నటన ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. శంభాజీ పాత్ర పోషించేందుకే అతను పుట్టాడేమో అనిపించే విధంగా నటించాడు. ఒక సింహం గర్జిస్తున్న విధంగా అతన నటన సాగింది. ఇక వర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా మరోసారి తన విశ్వరూపం చూపించాడు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గా అక్షయ్ ఖన్నా నటన అత్యుత్తమంగా ఉంది. అందుకే ఈ చిత్రం అంత గొప్పగా అనిపించింది. ఇక పతాక సన్నివేశాల్లో వీరిద్దరి సంభాషణ గురించి ఎంత పొగిడినా తక్కువే. సినిమాలో డైలాగులు, సన్నివేశాలు, వాటిని చిత్రీకరించిన విధానం, సంగీతం, నటీనటుల నటన, అన్ని అద్భుతంగా కుదిరాయి. అందుకే ఉత్తరాది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. చాలా తక్కువ రోజుల్లో అంటే 22 రోజుల్లోనే ఈ చిత్రం ఇండియాలో 500 కోట్ల వసూళ్లను అందుకోగలిగింది.
ఈ సినిమాకు లోపాలు వెతికే ప్రయత్నంలో చాలా మంది ఏం చెప్పలేకపోయినా, కొద్ది మంది మాత్రం హీరోయిన్ రష్మిక, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఇంకొంత శ్రమించాల్సి ఉండాల్సిందని, లేదా వారి స్థానంలో దీపిక లాంటి కథానాయిక, అజయ్ అతుల్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేయాల్సింది అని రాసుకొచ్చారు. అయితే అది పెద్ద సమస్యే కాదు. సింహం లాంటి పాత్రలో నటిస్తున్న విక్కీకి రష్మిక పాత్ర సరిగ్గా సరిపోయింది. రెహమాన్ కూడా తాను చేయాల్సిన ప్రయోగాలు , సన్నివేశాలు రక్తి కట్టించేందుకు అద్భుతమైన బాణీలు సమకూర్చాడు.
ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధించిందో తెల్సిందే. అయితే ఎంత స్థాయిలో వసూళ్లతో సరిపెట్టుకుంటుంది అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఛావా వసూళ్లు 650 కోట్లు దాటాయి. ఇంకా ఇంకా ఈ సినిమా గురించి చాలా చెప్పవచ్చు.. ఏ సన్నివేశాన్ని ఎలా తీసాడో వివరించవచ్చు.. అలా రాసుకుంటే వెళ్తే, చాలా పెద్ద స్టోరీ అవుతుంది. సారీ రివ్యూ అవుతుంది. కాని ఛావా మాత్రం హిందీ ఇండస్ట్రీ వచ్చిన అత్యుత్తమ చిత్రం. తప్పక చూడాల్సిన చిత్రం. కాబట్టి ఆలస్యం చేయకుండా టికెట్స్ బుక్ చేసుకుని వెండితెరపై శంభాజీ జీవిత చరిత్రను తెల్సుకోండి.
ఇవి కూడా చవవండి..