
16 ఏళ్ల లోపు పిల్లలు.. అంటే మైనర్లు.. రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లకా.. ఈ అంశం పై నిర్ణయం తీసుకోండని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు మైనర్లను థియేటర్స్ కు అనుమించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటల్లోపు రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్ల లోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని థియేటర్ల యజమానులకు స్పష్టం చేసింది. పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక తల్లి మరణించడంతో పాటు ఒక చిన్నారి తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో ఇక చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది.
బెనిఫిట్ ,స్పెషల్ షోలకు అనుమతులివ్వడం, టికెట్ రేట్ల పెంపు పై దాఖలైన పలు పిటీషన్ లపై జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ ల తరపు న్యాయవాదులు విజయ్ గోపాల్, సుల్తానా బాషా, మామిడాల మహేష్ వాదిస్తూ.. వేళ కాని వేళలో సినిమాలకు వెళ్లే మైనర్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. రాత్రి 11 గంటల తర్వాత సినిమా థియేటర్లకు ,అలాగే మల్టీప్లెక్సుల్లోకి 16 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించడం భావ్యం కాదని కోర్టు భావిస్తోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ, అప్పటి వరకు 16 ఏళ్ల లోపు పిల్లలను ఉదయం 11 లోపు, అలాగే రాత్రి 11 తర్వాత సినిమా ప్రదర్శనలకు అనుమతించరాదని థియేటర్ యజమానులకు ఆదేశాలను జారీ చేశారు. హోం శాఖ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తదితరలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేశారు.