అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు దావానలంగా మారింది. నాలుగు వైపుల నుంచి మంటలు దూసుకురావడంతో, వేలాది ఎకరాల్లో విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు. కార్చిచ్చు మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. దాదాపు 4.2 లక్షల కోట్ల సంపద కాలి బూడిదైందని అంచనా. లాస్ ఏంజెలెస్ కు ఈశాన్య ప్రాంతంలోని ఇన్ ల్యాండ్ లో ఫూట్ హిల్స్ లో చిట్టడవిలో మంటలు చెలరేగాయి. క్రమంగా నగరంవైపు దూసుకొచ్చాయి. బలమైన ఈదురు గాలులు వీచడంతో, మంటల తీవ్రత మరింత పెరిగింది. ప్రముఖంగా సంపన్నలు నివశించే పాలిసాడ్స్ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. పెసఫిక్ పాలిసాడ్స్ లో చెలరేగిన మంటలు దాదాపు 27వేల ఎకరాలను దగ్దం చేసాయి. రెండు వేల ఇళ్లు, వ్యాపార స్థలాలు, కాలి బూడిద అయ్యాయి. 10 వేల ఎకరాలకు పైగా అడవులు తగలబడిపోతున్నాయి. శాన్ ఫెర్నాండో వ్యాలీలో మాత్రం కార్చిచ్చును అదుపు చేయడంలో అగ్నిమాపక సిబ్బంది విజయాన్ని సాధించారు. ఇంకా వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
మంటలను ఆర్పడానికి విమానాలు, హెలికాప్టర్లు, బుల్డొజర్లుతో సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు 1.3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, అక్కడి నుంచి పారిపోయారు. ఖరీదైన సామాగ్రి, వాహనాలను అక్కడే విడిచిపెడుతున్నారు. వీధుల్లోను దట్టమైన పొగలు కమ్మేశాయి. రాత్రి వేళల్లో గంటకు వంద మైళ్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వేల హెక్టార్ల అడవులు అగ్నికి ఆహుతి అయ్యాయి.
ఇక్కడ చాలా రోజులుగా వర్షాలు పడకపోవడంతో గడ్డి, చెట్లు ఎండిపోయాయి. దాంతో మంటల తీవ్రత అధికంగా ఉంది. దీంతో లాస్ ఏంజిల్స్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కార్చిచ్చు పై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్చిచ్చును అదుపు చేయడంలో విఫలమైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ వెంటనే రాజీనామా చేయాలని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేసారు. ఏళ్లతరబడి వాటల్ మేనేజ్ మెంట్ లోని లోపాలను ఈ అగ్ని ప్రమాదాలు తెలియజేస్తున్నాయి అన్నారు.
హాలీవుడ్ నటులు యూజీన్ లెవి, జేమ్స్ వుడ్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు ఇళ్లు, కార్లు వదిలేసి సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్తారు. హాలివుడ్ హిల్స్, బెవర్లీ హిల్స్, మలిబు, శాన్ పెర్నాండో తదితర ప్రాంతాలు కార్చిచ్చు వ్యాపించే ప్రమాదముంది. హాలీవుడ్ థీమ్ పార్క్, యూనివర్సల్ సిటీవాక్ ను మూసి వేస్తున్నట్లు యూనివర్సల్ స్టూడియోస్ ప్రకటించింది.
లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు హాలీవుడ్ లోని ఐకానిక్ నిర్మాణాలను కాల్చి బూడిద చేసే ప్రమాదం ఉంది. ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్ ను కూడా అగ్నిమాపక సిబ్బంది ఖాలీ చేసింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆస్కార్ నామినేషన్ ప్రాసెస్ ఆలస్యం కానుంది.
లాస్ ఏంజెలెస్ లోని పసిఫిక్ పాలీ సేడ్స్ ప్రాంతంలోని వరల్డ్ ఫేమస్ చార్టర్ హైస్కూల్ వరకు మంటలు వ్యాపించాయి. ధనవంతుల బిడ్డలు ఈ స్కూల్ లో చదువుకుంటుంటారు. పలు హాలీవుడ్ మూవీస్ లోనూ ఈ స్కూల్ ను చూడవచ్చు. కార్చిచ్చు కారణంగా పాఠశాలలో కొంత భాగాన్ని మంటలు అంటున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. క్రీడాపరికరాలు, బోధనా పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. ఎన్ని కోట్లున్నా ప్రకృతి ప్రకోపిస్తే ఎంతటి వారైనా తలవంచాల్సిందే అంటూ కార్చిర్చు పై స్థానిక వార్తా సంస్థలు ప్రత్యేక కథనాల్లో పరిస్థితులను వివరిస్తున్నాయి.