
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇరు దేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ దాడల్లో పలువురు ఇరాన్ కీలక నేతలు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడులు చేస్తోంది ఇరాన్. ఇదే సమయంలో ఇజ్రాయెల్ గతాన్ని గుర్తు చేసి, ఇరాక్ లో సద్దాంను గద్దె దించిన రోజులను గుర్తు చేసుకోమంటోంది. సద్దాంకు పట్టిన గతే ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీకి పడుతుంది అంటోంది. ఇంతకీ ఇజ్రాయెల్ గతంలో చేపట్టిన ఆపరేషన్ ఏంటి అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.
అయితే గతంలో ఇరాక్ మాజీ అధ్యక్షుడు, నియంత సద్దాం హుస్సేన్ హతమార్చేందుకు, ఇజ్రాయెల్ చేపట్టిన భారీ ఆపరేషన్ , దారుణంగా విఫలమైంది. సొంత సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. చాలా ఏళ్లు ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ ను ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడింది.
కాని రహస్యం ఎప్పటికీ రహస్యంగా నిలవదు కదా.. కొన్నాళ్లకు బయటపడింది. తప్పక ఇజ్రాయెల్ కూడా దర్యాప్తుకు ఆదేశించింది. రిహార్సల్స్ ప్లానింగ్, కమ్యూనికేషన్ గ్యాప్, పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించకపోవడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, లాంటి లోపాల వల్లే, సద్దాం హతమార్చాలనే ప్లాన్ తుస్సుమందని ఇజ్రాయెల్ తెల్సుకుంది. ఇంతకీ ఏంటా ఫెయిల్యూర్ ఆపరేషన్ అంటారా.. ఆపరేషన్ బ్రాంబుల్ బుష్
1991 గల్ఫ్ యుద్ధం తర్వాత, సద్దాం హుస్సేన్ ను ఇజ్రాయెల్ తమ దేశానికి ఊహించని, పెనుముప్పుగా మారుతాడని ఫిక్స్ అయింది. సద్దాం పాలనలో ఇరాక్ పలుమార్లు క్షిపణి ప్రయోగాలు చేయడంతో ఇజ్రాయెల్ మొస్సాద్ రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఆయుధాలు సిద్ధమవుతున్నాయని మొస్సాద్ గుర్తించింది. వెంటనే సమాచారాన్ని ఇజ్రాయెల్ మిలటరీకి ఉప్పందించింది. దీంతో పుట్టుకొచ్చిందే ఆపరేషన్ బ్రాంబుల్ బుష్. ఈ ఆపరేషన్ తో సద్దాంను తొలగించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
సద్దాం సొంతూరు తిక్రిత్ లో ఓ అంత్యక్రియల కార్యక్రమానికి అతను వస్తున్నాడని తెలిసింది. దీంతో అదే రోజు ఆపరేషన్ అమలు చేసేందుకు ముహూర్తం పెట్టింది ఇజ్రాయెల్. సద్దాం వస్తాడు. కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు పేల్చాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. కాని అనుకున్నది ఒక్కటి జరిగింది మరొకటి. ఆపరేషన్ బ్రాంబుల్ బుష్ అట్టర్ ఫెయిల్ అయింది. సద్దాం బ్రతికిపోయాడు.
సద్దాంను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే ముందు, 1992, నవంబర్ 5న ఇజ్రాయెల్ సైనికులు ,నెగెవ్ ఎడారి ప్రాంతంలో రిహార్సల్స్ చేపట్టారు. ప్రాక్టీస్ కోసం ఆపరేషన్ లోని సభ్యులు మిస్సైళ్లను ఉపయోగించారు. అయితే పొరపాటు జరిగింది. ఓ కమాండో పేల్చిన క్షపణి సొంత సైనికుల ప్రాణాలు తీసింది. అక్కడిక్కడే ఐదుగురు సైనికులు మృతి చెందారు. మరో ఆరుగులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆపరేషన్ ప్రాక్టీస్ దగ్గరే ఆగిపోయింది. కామాండోల మృతిని కొన్నాళ్లపాటు ఇజ్రాయెల్ బయటికి చెప్పలేదు. ఆ తర్వాత ఎలాగో బయటికి వచ్చింది. తప్పక దర్యాప్తు చేపట్టింది.
అప్పుడే నిర్లక్షానికి తప్పదు భారీ మూల్యం అనే విషయం తెల్సుకుంది. 2003లో సేమ్ సద్దాంను అమెరికా దళాలు పట్టుకున్నాయి. పలు నేరాలకు సంబంధించి దోషిగా తేలడంతో 2006లో ఉరిశిక్ష విధించారు.