
కశ్మీర్ కు పర్యాటకమే ఆధారం. అందుకే కశ్మీరీలు పర్యటకులను దేవుళ్లలా చూస్తారు. పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ అనే అందమైన ప్రాంతంలో, ఉగ్రవాదులు పర్యాటకులపై దాడులకు తెగబడ్డారు.
ఇదే ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. వేసవిలో పర్యాటకలు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. మినీ స్విట్జర్లాండ్ లో హాయిగా గడిపేస్తారు. భూతల స్వర్గంలో విహరిస్తారు. పహల్గాం నుంచి సముద్ర మట్టానికి మూడు వేలకు పైగా అడుగుల ఎత్తులో ఉన్న టులియన్ సరస్సుకు వెళ్లాలి అనుకునేవాళ్లు, బైసరన్ నుంచి వెళ్లాల్సిందే.. శీతాకాలం ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇంత అందమైన ప్రదేశానికి వెళ్లాలి అంటే గుర్రపు స్వారీ తప్ప మరో రవాణా సదుపాయం లేదు. ట్రెక్కింగ్ కు వచ్చేవారు సైతం ఇక్కడ తమ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటుంటారు.
2019 ఆగస్ట్ 5 కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసిన తర్వాత, జమ్మూ కశ్మీర్ రెండు గా విడిపోయింది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు అయ్యాయి. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగంది. మళ్లీ కశ్మీరీల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడితోమరో మారు కలకల రేగుతోంది.