
పార్టీ పెట్టి పదేళ్లు దాటుతోంది. ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లేదన్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన ప్రతీసారి గాజు గ్లాసు గుర్తుకు టెన్షనే.. కాని ఇప్పుడు జనసేనకు ఆ సమస్యలు అన్ని తొలిగిపోయినట్లే. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. పార్ట్టీ పెట్టిన పదేళ్లకు , ఒక పార్టీ గుర్తింపు అందుకోవడం చాలా అరుదు. ఇలాంటి పరిస్థితిలో మరో పార్టీ ఉంటే, ఎప్పుడో కనుమరుగు అయ్యేది. కాని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొండితనమే పార్టీని ఈరోజు ఎవరూ ఊహించని స్థాయికి తీసుకెళ్లింది.

పదేళ్లుగా ఒంటరి పోరాటం చివరికి గత అసెంబ్లీ ఎన్నికల్లో హండ్రెస్ పర్సెంట్ స్టైక్ రేట్స్ తో సీట్స్ గెలవడంతో సరికొత్త చరిత్రను లఖించింది జనసేన. మొదట పార్టీ విజయం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్ని కూడా జనసేన శ్రేణులను కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ఎన్నో ఏళ్లుగా చేసిన పోరాటాలు, ఆటుపోట్లు, అవమానాలను అధిగమించి జనసేన ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేరింది. అంతే కాదు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన కు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కు లేఖను పంపించింది.
గత ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో ,2 లోక్ సభ స్థానాల్లో జనసేన పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంది. ఇది నిజంగా జనసేన పార్టీకి, ఆ పార్టీ కార్యకర్తలకు పండగ లాంటి వార్త. సంబరాలు చేసుకోవాల్సిన వార్త.